
D Spiritual: Dec 24: ఈ కాలంలో నోములు, వ్రతాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులంతా కలిసి ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ నోములు, వ్రతాలు నిర్వహించడం మన సంప్రదాయం. అందువల్ల ఈ మాసంలో ప్రతి ఇంటి వాతావరణం ముత్తయిదువులతో కళకళలాడుతూ ఉత్సాహంగా ఉంటుంది.
నోములు లేదా వ్రతాలు పూర్తయిన తరువాత, పేరంటాలుగా వచ్చిన ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా రెండు అరటి పండ్లు, రెండు వక్కలు, రెండు తమలపాకులను తాంబూలంగా ఇస్తారు. కొందరు అరటిపండ్ల స్థానంలో కమలాకాయలను కూడా ఇస్తుంటారు. ఈ విధంగా తాంబూలం ఇవ్వడం ద్వారా అతిథులను గౌరవించడం, ఆశీర్వాదాలను స్వీకరించడం జరుగుతుంది.
ఒకే రోజున అనేక ఇళ్లలో వ్రతాలు జరిగే సందర్భాల్లో, ముత్తయిదువులు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లి తాంబూలం స్వీకరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమకు ఒక ఇంట్లో ఇచ్చిన తాంబూలాన్ని, తమ ఇంటికి వచ్చిన వారికి తిరిగి ఇస్తుంటారు. మరికొందరు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లే మార్గంలో, మొదటి ఇంట్లో పొందిన తాంబూలాన్ని దారిలో తెలిసినవారికి ఇచ్చేసి, రెండో ఇంటికి వెళ్లడం కూడా జరుగుతుంది.
ఇలా ఒకరు ఇచ్చిన తాంబూలాన్ని మరొకరికి ఇవ్వడం వలన పేరంటానికి వెళ్లిన ఫలితం పూర్తిగా లభించదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆయా దేవతల పట్ల, పూజా విధానాల పట్ల నిర్లక్ష్య భావనను ప్రదర్శించిన దోషం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.
అందుకే సంప్రదాయం ప్రకారం, ఎవరు స్వీకరించిన తాంబూలాన్ని వారు స్వయంగా ఉపయోగించుకోవాలి. అలా చేసినప్పుడే పేరంటానికి వెళ్లిన ప్రయోజనం సిద్ధించి, వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ ఆచరించడమే నోములు, వ్రతాల యొక్క అసలైన ఉద్దేశమని భావించాలి.
