
D Spiritual: Mar 10: కాకి హిందూ విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం కలిగిన పక్షిగా భావించబడుతుంది. శని దేవుడి వాహనంగా కాకిని పరిగణిస్తారు. అందుకే కాకితో సంబంధించిన అనేక విశేషాలు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. కాకిని కాలజ్ఞాని అని కూడా అంటారు. ఇది చాలా తెలివైన పక్షిగా గుర్తింపు పొందింది. ఇటీవల కాలంలో కాకిని ప్రధానంగా చూపిస్తూ కొన్ని సినిమాలు కూడా తెరకెక్కాయి. ఆధ్యాత్మికంగా కూడా కాకికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని కొందరు విశ్వసిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శుభఫలితాలను, మరికొన్ని సందర్భాల్లో అశుభ సంకేతాలను సూచిస్తుందని చెబుతారు.
కాకులు ఇంటి ముందుకు రావడం సహజమైన విషయమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కాకులు తరచుగా ఇళ్ల దగ్గర కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి ఇంటి పైకప్పుపై కూర్చొని ఆహారం తినడం లేదా ఇంటి ముందు నిలబడి అరవడం కూడా కనిపిస్తుంది. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కాకి ఎక్కడ కూర్చుంది, ఎలా ప్రవర్తిస్తుంది అన్నదానిపై ఆధారపడి దాని ఫలితాలు ఉంటాయని చెబుతారు.
చాలా మందికి కాకి ఇంటి ముందు రావడం మంచిదా లేదా అనే సందేహం ఉంటుంది. కొందరి నమ్మకం ప్రకారం, కాకి ఇంటి ముందుకు వచ్చి “కావు కావు” అంటూ అరుస్తే ఇంటికి చుట్టాలు లేదా అతిథులు రాబోతున్నారని భావిస్తారు. అయితే అదే కాకి ఇంటి ముందు కూర్చొని విచిత్రంగా లేదా చెడు స్వరంతో అరుస్తే అది అశుభ సంకేతంగా భావిస్తారని చెబుతారు.
అలాగే కాకి ఇంటి లోపలికి రావడం మంచిది కాదని కొందరు విశ్వసిస్తారు. ఒకవేళ కాకి ఇంటిలోకి ప్రవేశిస్తే అది చెడు సూచనగా భావిస్తారు. అందుకే కొందరు పండితులు అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు.
ఇంకా ఇంటి ముందు కాకుల గుంపు వచ్చి కూర్చోవడం కూడా కొందరి నమ్మకం ప్రకారం అశుభ సంకేతంగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో ఏదైనా సమస్య లేదా ప్రమాదాన్ని సూచించవచ్చని అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో కాకులు ఇంటి పైకప్పుపై కూర్చొని అరవడం కూడా కొన్ని సంకేతాలను సూచిస్తుందని చెబుతారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది చుట్టాలు రాబోతున్నారనే సమాచారం లేదా మరణ వార్త వంటి విషయాలకు సూచనగా కూడా భావిస్తారు.
