
చౌక ధరల వస్తువులతో యూరప్ పరిశ్రమలకు నష్టం.. భారత్ వైపే బెల్జియం చూపు
యూరప్ మార్కెట్‌లోకి భారీగా చౌక ధరల వస్తువులు ప్రవేశించడంతో తమ దేశ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో గుర్తించి, యూరప్‌ను ముందుగానే హెచ్చరించారని బెల్జియం ప్రధాని తెలిపారు. అయితే అప్పట్లో యూరప్ మోదీ సూచనలను పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటోందని చెప్పారు.
రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల్లో భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని బార్ట్ డి వెవర్ పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనాపై అధికంగా ఆధారపడటంతో యూరప్ ఇప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు. ఈ విషయంలో భారత్ తమను చాలా కాలం క్రితమే హెచ్చరించినప్పటికీ, అప్పట్లో ఆ సూచనలను తాము పెద్దగా పట్టించుకోలేదని ఆయన అంగీకరించారు.
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన బార్ట్ డి వెవర్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చైనా నుంచి తక్కువ ధరలకు భారీగా వస్తువులు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశించడం వల్ల అక్కడి స్థానిక పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు.
విదేశీ ఉత్పత్తుల పోటీ కారణంగా యూరప్‌లోని అనేక స్థానిక పరిశ్రమలు తమ మార్కెట్‌ను కోల్పోయాయని బెల్జియం ప్రధాని తెలిపారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ఇప్పుడు యూరప్ స్పష్టంగా గుర్తించిందని ఆయన వ్యాఖ్యానించారు.“గడిచిన కాలం యూరప్‌కు ఒక గుణపాఠం. చాలా కాలంగా తక్కువ ధరలకు భారీగా వస్తువులు మా మార్కెట్లలోకి వచ్చాయి. దీని ప్రభావంతో స్థానిక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి క్రమంగా పెరిగింది. చివరకు ఆ ఆధారపడటాన్నే రాజకీయ ఒత్తిడికి సాధనంగా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది” అని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యల్లో డి వెవర్ నేరుగా చైనా పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ, చైనా నుంచి భారీగా చౌకధరల ఉత్పత్తులు యూరప్ మార్కెట్లలోకి రావడం, దాని ప్రభావంతో అక్కడి స్థానిక పరిశ్రమలు నష్టపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే.. ఆయన వ్యాఖ్యలు చైనాను ఉద్దేశించే చేసినవేనని స్పష్టమవుతోంది.
