DSports Dec19 2025 :దుబాయ్: భారత మూలాలున్న ‘రోల్ బాల్’ క్రీడలో టీమ్ ఇండియా మరోసారి తన ప్రపంచ స్థాయి ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన 7వ రోల్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో విజేతలుగా నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కెన్యాకు షాకిస్తూ భారత్ రెండు టైటిల్స్‌ను కైవసం చేసుకుంది.

ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 11-10 తేడాతో కెన్యాపై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఒక దశలో 3-8తో వెనుకబడినప్పటికీ, భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని చివరి నిమిషాల్లో గోల్స్ చేసి విజేతలుగా నిలిచారు. పురుషుల జట్టుకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్.

మహిళల ఫైనల్‌లోనూ భారత్ తన పట్టు నిలుపుకుంది. కెన్యా మహిళా జట్టును 3-2 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని ముద్దాడింది. మహిళల జట్టుకు ఇది 3వ ప్రపంచకప్ టైటిల్.