D Spiritual: Nov 10: సంగమేశ్వర క్షేత్రంలో ముందుగానే దర్శనమిస్తున్న సోమనాథ స్వామి.. భక్తుల సందడి!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. తగ్గిన శ్రీశైలం జలాశయం నీటిమట్టం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సప్త నదుల సంగమ ప్రదేశంలో వెలసిన సంగమేశ్వర క్షేత్రం ముందుగానే భక్తులకు దర్శనమిస్తోంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సోమనాథ స్వామి.. ఈసారి కార్తీక మాసంలోనే నీటిమట్టం తగ్గడంతో బయటపడటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసం సమయానికి శ్రీశైలం జలాశయం వెనుక జలాలతో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునిగి ఉంటుంది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో క్షేత్రం పూర్తిగా బయటపడి భక్తులకు దర్శనమిస్తోంది. గతంలో కార్తీక మాసంలో సంగమేశ్వర క్షేత్రం దర్శనమిచ్చిన సందర్భాలు లేవని పలువురు శైవ భక్తులు చెబుతున్నారు.

మరోవైపు, కరవు పరిస్థితుల కారణంగా సంగమేశ్వర క్షేత్రం ముందుగానే బయటపడటంపై స్థానిక ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండుగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వైపు నుంచి చేరుకునే మార్గాలు

తెలంగాణ వైపు నుంచి సంగమేశ్వర క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు కొల్లాపూర్ పట్టణం మీదుగా చేరుకోవచ్చు. అక్కడి నుంచి పడవల ద్వారా క్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా పెంటవెల్లి మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చేరుకొని, అక్కడి నుంచి పడవల ద్వారా సంగమేశ్వర క్షేత్రం సమీపానికి చేరుకోవచ్చు. అనంతరం కొంత దూరం కాలినడకన ప్రయాణించి సోమనాథ స్వామిని దర్శించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ వైపు నుంచి వచ్చే భక్తులు నందికొట్కూరు పట్టణం మీదుగా కృష్ణానది వరకు వాహనాల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి కాలినడకన సంగమేశ్వర క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకునే మార్గం ఉంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి

శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన సంగమేశ్వరంలోని సోమనాథ స్వామి దర్శనమిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి సోమనాథ స్వామిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నది ప్రాంతంలో భక్తుల ప్రయాణాలకు సంబంధించి పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భద్రతా ఏర్పాట్లు చేయాలని, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అదనపు బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పర్యాటక శాఖ ద్వారా అవసరమైన సంఖ్యలో బోట్లను ఏర్పాటు చేసి, భక్తులు సురక్షితంగా సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *