Ilaiyaraaja Honoured in Australian Parliament with a Special Commemorative Stamp

D News : దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఐదు దశాబ్దాల సంగీత ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంటు ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఈ గౌరవం తనను ఎంతో ఆనందానికి, గర్వానికి గురిచేసిందని ఇళయరాజా తెలిపారు.

తమిళనాడులోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన తనకు ఆస్ట్రేలియాలో ఇంతటి గుర్తింపు లభించడం భావోద్వేగానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

తన 50 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని గుర్తించి ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసినందుకు ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులకు ఇళయరాజా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విక్టోరియన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి, ఎంపీ ఎన్వర్ ఎర్డొగాన్‌కు ధన్యవాదాలు చెప్పారు.

తన సంగీతానికి ప్రాణం పోసిన కళాకారులు, తనతో కలిసి ప్రయాణించిన సాంకేతిక నిపుణులు, ఎన్నో తరాలుగా తన పాటలను ఆదరిస్తున్న శ్రోతలే ఈ ప్రయాణానికి కారణమని ఇళయరాజా పేర్కొన్నారు. వారందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఇళయరాజాకు అభినందనలు తెలుపుతున్నారు.

ఆస్కార్ బరిలో ఇళయరాజా సంగీతం

ఇదిలా ఉంటే ఇళయరాజా ఇటీవల సంగీతం అందించిన మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ కూడా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున పోటీకి అధికారికంగా ఎంపికైనట్లు సమాచారం. దీంతో ఒకవైపు అంతర్జాతీయ గౌరవం, మరోవైపు ఆస్కార్ బరిలో ఆయన సంగీతం.. ఇలా ఇళయరాజా మరోసారి వార్తల్లో నిలిచారు.

By Avinash