
D Spiritual: Dec 3: హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. అలాగే ఒక్కో గ్రహానికి ఒక్కో అధిదేవత ఉంటాడు. బుధవారానికి బుధ గ్రహం అధిపతి అయితే, బుధ గ్రహానికి వినాయకుడు అధిపతి. అందుకే బుధవారం వినాయకుని పూజకు శ్రేష్టం. సాధారణంగా ఉదయం నిత్య పూజలు చేస్తుంటాం కానీ బుధవారం ఉదయం నిత్య పూజ చేసుకున్నా సరే సాయంత్రం సమయంలో గణపతిని పూజిస్తే కలిగే శుభ ఫలితాలు చాలా శ్రేష్ఠమైనవని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంకాలం సమయంలో గణపతిని ఎలా పూజించాలి, ఆ పూజ ఫలం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
బుధవారం వినాయకుని పూజకు అత్యంత శ్రేష్ఠమైన రోజు. తొలి పూజలందుకునే విఘ్న వినాయకుని శుభ కార్యాల్లో, నోముల్లో, వ్రతాల్లో ముందుగా పూజించడం ఆనవాయితీ. వినాయకుని ప్రధాన దేవతగా ఉపాసిస్తే జీవితంలో ఎన్నో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని గణేశ పురాణంలో చెప్పబడింది. గణనాధుని అనుగ్రహం కోసం శాస్త్రోక్తంగా ఎలా పూజించాలో తెలుసుకోవడం ముఖ్యమే.
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల సమయాన్ని సంధ్యా సమయం అంటారు. పగలు నుంచి రాత్రికి పరివర్తనం జరుగే ఈ సంధ్యా కాలంలో గణపతి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని స్కంద పురాణం, గణేశ పురాణం చెబుతున్నాయి. ఈ సమయంలో చేసే గణపతి పూజ విఘ్నాలను వేగంగా తొలగిస్తుందని శాస్త్రవచనం. అలాగే రోజంతా మనల్ని వేధించే ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుందని విశ్వాసం.
నవగ్రహాల్లో బుధ గ్రహం బుద్ధి, విద్య, విజయం, వాక్చాతుర్యం, వ్యాపార విజయాలకు కారణం. ఈ బుధ గ్రహానికి అధిదేవత అయిన గణపతి ‘విద్యాప్రసాదకుడు’, ‘విఘ్ననాశకుడు’. కాబట్టి బుధవారం సంధ్యా కాలంలో చేసే గణపతి పూజ ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది.
బుధవారం సంధ్యా సమయంలో గరిక పూజ చేయడం శ్రేష్ఠం. ముందుగా శుచిగా తయారై గణేశుని ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి నమస్కరించాలి. అనంతరం గణపతికి అత్యంత ప్రీతికరమైన గరికతో పూజ చేయాలి.
గణేశ పురాణం ప్రకారం వినాయకునికి 21 గరికెలు సమర్పించాలి. ఎందుకు 21 అని చూస్తే—5 పంచేద్రియాలు, 5 పంచభూతాలు, 5 పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం, సత్త్వ-రజో-తమో గుణాలు కలిపి మొత్తం 21 అవుతాయి. ఇవన్నీ కేంద్రీకరించి దేవునిపై ధ్యానం నిలుపడానికి 21 గరికెలు సూచకంగా చెప్పబడింది.
గరిక పూజ అనంతరం గణేశుని పంచరత్న స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. తరువాత గణపతికి ప్రీతికరమైన ఉండ్రాళ్లు, మోదకాలు, అరటిపండ్లు, కొబ్బరికాయ వంటి నైవేద్యాలు సమర్పించి, మంగళహారతి చెప్పి పూజను పూర్తి చేయాలి.
ఈ విధంగా బుధవారం సంధ్యా సమయంలో చేసే గణపతి పూజ అనేక సమస్యలను తొలగిస్తుంది. విద్యలో అడ్డంకులు తొలగి పరీక్షల్లో విజయాలు సిద్ధిస్తాయి. బుద్ధి, చతురత పెరుగుతుంది. వాక్శుద్ధి వృద్ధి అవుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రుభయం తొలగుతుంది. ముఖ్యంగా సమయానుకూల నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తాడు వినాయకుడు.
కాబట్టి మనమూ బుధవారం సంధ్యా సమయంలో గణనాధుని పూజించి జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యం పొందండి.
ఓం శ్రీ గణాధిపతయే నమః!
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.
