
DSports 5 Dec:న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ప్రస్తుత ఫామ్, జట్టులో తన పాత్రపై ప్రశంసల వర్షం కురిపించాడు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్న విధానం గురించి మాట్లాడుతూ, అతని పాత్రపై (Role) స్పష్టమైన అవగాహన ఉందని స్టెయిన్ ప్రశంసించాడు.
టాప్ ఆర్డర్‌లో ఆడితే సెంచరీల మోత
దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ (మొదటి వన్డేలో 60, రెండో వన్డేలో 66*) బ్యాక్-టు-బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.”కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా ఆడాడో చూస్తే, అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే, కచ్చితంగా సెంచరీల మోత మోగిస్తాడు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు అతనికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం లభిస్తుంది.” అని స్టెయిన్ ‘స్టార్ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ పేర్కొన్నాడు.అయితే, “ఆ స్థానాలు (ఓపెనింగ్, నెం.3) ఇప్పటికే ఇతర ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి. అయితే, ఈ జట్టులో తన పాత్ర ఏమిటో రాహుల్‌కు బాగా తెలుసు. అందుకే అతను మిడిల్ ఆర్డర్‌లో వచ్చినా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ రాహుల్ అద్భుతంగా ఆడాడు” అని స్టెయిన్ కొనియాడాడు.
ఫినిషర్‌గా రాహుల్
గత కొన్నాళ్లుగా వన్డే క్రికెట్‌లో వికెట్ కీపర్-బ్యాటర్‌గా, కీలకమైన ఫినిషర్ పాత్రలో రాహుల్ స్థిరంగా రాణిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివరి భాగంలో జట్టుకు అవసరమైనప్పుడు వేగాన్ని పెంచడం లేదా భాగస్వామ్యాన్ని నిర్మించడం వంటి వాటిపై రాహుల్‌కు సరైన అవగాహన ఉందని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్న రాహుల్, వన్డేల్లో కూడా అదే స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలాన్నిస్తున్నాడు.
రాహుల్ తన స్థానాన్ని గురించి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకోవడం, స్థిరంగా రాణించడం మాజీ క్రికెటర్లను సైతం ఆకట్టుకుంటోంది.
