
DNews:20 Dec: హైదరాబాద్ నగరంలోని అనేక చెరువులకు HYDRA కొత్త ఊపిరి పోస్తోంది. ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను గుర్తించి, పునరుజ్జీవన పనులతో నగరానికి పర్యావరణ పరంగా కీలకమైన ఆస్తులుగా మారుస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకురాగా, కూకట్‌పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అలాగే పాతబస్తీలోని పురాతన చెరువును కూడా హైడ్రా తిరిగి జీవం పోసింది.
ఈ క్రమంలో ఆక్రమణలతో దాదాపు కనుమరుగైన బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువును హైడ్రా పూర్తిస్థాయిలో పునరుద్ధరించింది. పాతబస్తీకే మణిహారంగా ఈ చెరువును తీర్చిదిద్దుతూ, విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే జనవరిలో చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి విషయంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులు, ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాల ఏర్పాటు పనులను కూడా ఆయన పరిశీలించారు.
చెరువును కేవలం నీటి నిల్వ కేంద్రంగా కాకుండా విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. ఔషధ గుణాలు ఉన్న చెట్లు, మొక్కలను విస్తృతంగా నాటాలని, నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో ఉపయోగించిన రాతిని మళ్లీ వినియోగించి కట్టడాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఇన్‌లెట్‌లు, అవుట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చేపట్టిన నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించారు.
చరిత్రపరంగా ఈ చెరువు నిజాంల కాలంలో సుమారు 104 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమంలో అది 17.05 ఎకరాలకు తగ్గగా, ఆక్రమణల కారణంగా చివరికి కేవలం 4.12 ఎకరాలకే పరిమితమైంది. ప్రస్తుతం హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించి, చెరువును పునరుజ్జీవింపజేస్తూ హైదరాబాద్ నగరానికి ఒక కీలక పర్యావరణ ఆస్తిగా తీర్చిదిద్దుతున్నారు.
