
హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో భారీ బంగారం చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆనంద్‌బాగ్‌లోని ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసిన నేపాలీ కుటుంబంపై చోరీకి సంబంధించి ఫిర్యాదు నమోదైంది. సుమారు 48 తులాల బంగారం చోరీ చేసి అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు కుటుంబం దాదాపు 11 ఏళ్లుగా అదే అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ యజమానుల నమ్మకాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఏళ్లుగా అక్కడే నివసిస్తూ అపార్ట్‌మెంట్ వాసులతో సన్నిహితంగా మెలిగిన వారు ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నేపాలీ కుటుంబం అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం ఫ్లాట్ నంబర్లు 301, 302లో బంగారం చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు. మొత్తం సుమారు 48 తులాల బంగారం కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? చోరీకి గురైన బంగారం ఎక్కడికి తరలించారు? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
