
హైదరాబాద్ శివారులో నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టును తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ చూసి నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్న ప్రధాన నిందితుడు.. అద్దె ఇంట్లోనే ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించాడు. పోలీసులు సుమారు రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకోగా, నలుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
హైదరాబాద్ శివారులో భారీ నకిలీ కరెన్సీ తయారీ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా నకిలీ నోట్ల తయారీ విధానాలను నేర్చుకుని, అద్దె ఇంట్లోనే ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
నవంబర్ 1న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని జాతీయ రహదారి 65పై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, షాద్నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు రూ.8 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు లభించాయి. దీంతో కారులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా హైదరాబాద్ శివారులోని కుంట్లూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో నకిలీ నోట్ల తయారీ కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించి మరో 134 కట్టల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.70 కోట్లుగా అంచనా వేశారు.
అంతేకాకుండా నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన కలర్ ప్రింటర్లు, స్కానర్లు, ల్యాప్టాప్, లామినేషన్ మెషిన్, నోట్లను కత్తిరించే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యూట్యూబ్ వీడియోలతో నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్న నిందితుడు
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మడుపోజు కర్ణాకర్ యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా నకిలీ కరెన్సీ తయారీ విధానాలను నేర్చుకున్నాడు.
అసలైన రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫొటోషాప్ వంటి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సాయంతో వాటిలో మార్పులు చేసి నకిలీ నోట్లను ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం అద్దె ఇంట్లో ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు.
కొనుగోలుదారులను పోలీసులమంటూ బెదిరించి డబ్బుల దోపిడీ
మొదట ఈ ముఠా అసలు డబ్బుకు బదులుగా మూడు నుంచి నాలుగు రెట్లు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ కొనుగోలుదారులకు ఆశ చూపించింది. అంటే రూ.లక్ష అసలు నగదుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ అక్రమ లావాదేవీలకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ముఠా మరో ఎత్తుగడ వేసింది.
ముందుగా అసలైన కరెన్సీ నోట్లను చూపించి కొనుగోలుదారుల నమ్మకాన్ని సంపాదించేవారు. ఆ తర్వాత నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, నకిలీ తుపాకులు, ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలతో పోలీసులుగా నటించేవారు.
అనంతరం కొనుగోలుదారులను బెదిరించి వారి వద్ద ఉన్న అసలు డబ్బును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా ఇద్దరు వ్యక్తుల నుంచి వేర్వేరు ఘటనల్లో రూ.2 లక్షలు, రూ.3 లక్షలు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నలుగురు అరెస్ట్.. మరో ముగ్గురి కోసం గాలింపు
ఈ నకిలీ కరెన్సీ ముఠా కేసులో మడుపోజు కర్ణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు.
మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ముఠా కార్యకలాపాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? నకిలీ నోట్లను ఎక్కడెక్కడికి సరఫరా చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
