
DNews:20 Dec: హైదరాబాద్ నగరంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా కొంపల్లి సర్కిల్ పరిధిలోని జయభేరి పార్కులో ఒక వృద్ధురాలిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. భీమవరం నుంచి తన కుమారుడి వద్దకు వచ్చిన చిలుకలపల్లి చిన్నమ్మ (75) అనే వృద్ధురాలు, శుక్రవారం సాయంత్రం ఇంటి గేటు తీసుకుని బయటకు వస్తుండగా ఒక్కసారిగా కుక్క ఆమెపై పడి కాలిని కోరికేసింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమివేసి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే వీధిలో గత కొద్దిరోజులుగా సదరు కుక్క సుమారు 12 మందిపై దాడి చేసిందని, పిల్లలు స్కూళ్లకు వెళ్లాలన్నా, పెద్దలు బయట తిరగాలన్నా భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
