
D Educt: Oct 27: పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష.. పాలిటీలో మంచి మార్కుల కోసం ఇలా చదవండి!
హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే పాలిటీ (రాజ్యాంగం) విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సరైన ప్రణాళికతో ముఖ్యమైన అంశాలను క్రమపద్ధతిలో చదువుతూ, తరచూ పునశ్చరణ చేస్తే ఈ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
ముందుగా భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రాజ్యాంగ నిర్మాణం, ప్రవేశిక, పౌరసత్వం వంటి ప్రాథమిక అంశాలను అధ్యయనం చేయాలి. అనంతరం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పరీక్షల్లో ముఖ్యమైన రాజ్యాంగ అధికరణాలపై పట్టు సాధించాలి.
తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యవస్థపై దృష్టి సారించాలి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అధికారాలు, పార్లమెంట్ నిర్మాణం, సమావేశాలు, విధులు వంటి అంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, గవర్నర్, శాసనసభల అధికారాలు, విధులను కూడా క్షుణ్ణంగా చదవాలి.
న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలనూ విస్మరించకూడదు. సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్మాణం, అధికారాలు, విధులు, న్యాయ సమీక్ష వంటి ముఖ్యమైన అంశాలను చదువుకోవాలి. వీటితోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థ, పట్టణ స్థానిక సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి.
చివరగా, రోజువారీ రాజకీయ పరిణామాలు, ప్రస్తుత వ్యవహారాలను (కరెంట్ అఫైర్స్) రాజ్యాంగ అంశాలతో అనుసంధానించుకుని చదవాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ, ముఖ్యమైన అంశాలను ప్రతిరోజూ పునశ్చరణ చేయడం ద్వారా పాలిటీలో మంచి మార్కులు సాధించే అవకాశాలు పెరుగుతాయి.
