
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న SPARK క్లబ్‌ల విద్యార్థుల ప్రతినిధులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై చైతన్యం కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలు, కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ‘Stay Alert, Stay Aware, Stay Safe & Secure’ అనే నినాదంతో ఈ ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
