D Spiritual: Oct 11: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 20న చక్రస్నానం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా చాంద్రమాన పంచాంగం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తోంది.

ప్రత్యేక ఉత్సవ ఘట్టాలు.. వాహన సేవలు

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత ఉంది. సాధారణ వార్షిక బ్రహ్మోత్సవాల మాదిరిగా ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వంటి ఘట్టాలు ఉండవు. అక్టోబర్ 11న అంకురార్పణతో ప్రారంభమయ్యే వేడుకలు, అక్టోబర్ 20న చక్రస్నానంతో ముగుస్తాయి.

ఉత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక వాహన సేవలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తారు.

అక్టోబర్ 16న గరుడ వాహన సేవ

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 16న నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్ 17న పుష్పక విమాన సేవ, అక్టోబర్ 19న స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. చివరి రోజైన అక్టోబర్ 20న ఉదయం 6 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరగనుంది. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Tirumala Brahmotsavalu: పూర్తి షెడ్యూల్

అక్టోబర్ 11: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ.

అక్టోబర్ 12: ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ.

అక్టోబర్ 13: ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.

అక్టోబర్ 14: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవ.

అక్టోబర్ 15: ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ.

అక్టోబర్ 16: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.

అక్టోబర్ 17: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ.

అక్టోబర్ 18: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.

అక్టోబర్ 19: ఉదయం 7 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ.

అక్టోబర్ 20: ఉదయం 6 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం.

చక్రస్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం అక్టోబర్ 20న ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నారు. శ్రీవారి పుష్కరిణిలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. స్వామివారి వాహన సేవలు, ఉత్సవ ఘట్టాలను దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలిరానున్నారు.