
DNews:13 Dec: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన పేద పిల్లలకు ‘పాయిజన్ 2047’గా మారిందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో 116 మంది పిల్లలు మృతి చెందారని, అయినా ముఖ్యమంత్రిలో కనీస స్పందన లేదని మండిపడ్డారు.హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై కింగ్‌కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్ రావు బాధిత విద్యార్థులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కలుషిత ఆహారం వల్ల దాదాపు 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
“విద్యార్థులు అనారోగ్యానికి గురవుతుంటే ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఢిల్లీకి వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ, ఆసుపత్రిలో ఉన్న పిల్లలను పరామర్శించేందుకు సమయం ఉండదా?” అని ప్రశ్నించారు. పేద పిల్లల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, చలితోనూ, సరైన ఆహారం లేకనూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రెండేళ్ల పాలనలో స్కూలు విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొందని హరీశ్ రావు విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. “పురుగుల అన్నం తినలేమంటూ పిల్లలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పెరిగిపోతున్నాయి” అని చెప్పారు.

హోర్డింగులు, పేపర్ యాడ్లలో ‘తెలంగాణ రైజింగ్’ అంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, వాస్తవంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రి బెడ్లపై పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. “మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బుతో మంచి హాస్టళ్లు కట్టి, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించవచ్చు కదా?” అని ప్రశ్నించారు.రైతులు, ఆటో డ్రైవర్లు, పాఠశాలల్లో పిల్లలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కానీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు మాత్రం ప్రభుత్వం మొత్తం దృష్టి పెడుతోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నారు… కానీ అది పాయిజన్ 2047గా మారింది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
