D Educt: Oct 29: రాష్ట్రంలోని మోడల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొరుగు సేవల విధానంలో మొత్తం 776 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ నియామకాల్లో భాగంగా ఆర్ట్‌, యోగా, కంప్యూటర్‌ టీచర్లతో పాటు లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 194 మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో నాలుగు పోస్టుల చొప్పున మొత్తం 776 ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

నవంబరు నుంచి మార్చి వరకు ఐదు నెలలపాటు ఈ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. నియామక ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. దీంతో మోడల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.