
D News: Oct 29: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో సహాయపడేందుకు పీఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ పేరుతో ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే లక్ష మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఎంతమంది అభ్యర్థులు వచ్చినా ఏడాదిపాటు శిక్షణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే, దీపావళిలోగా జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో రూపొందించిన ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
గతంలో 2016లో ఖమ్మంలో 2,300 మంది అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించగా, వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
వ్యక్తిగతంగా ఇలాంటి శిక్షణ పొందాలంటే ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని, పుస్తకాలు, ఇతర అధ్యయన సామగ్రి కోసం అదనంగా రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యయమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఖర్చులను భరించలేని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలను కూడా అందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
