
D Spiritual: Nov 17: తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాస శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు సోమవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో తెలియక ఏవైనా దోషాలు జరిగి ఉంటే వాటి నివారణార్థం కార్తీక మాసంలో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. లోకకల్యాణార్థం 15వ శతాబ్దం నుంచే ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యలో నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని 1980 నుంచి టీటీడీ పునరుద్ధరించి కొనసాగిస్తోందని వివరించారు.
శ్రీవారి పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు ఈవో తెలిపారు. సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పయాగం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ పుష్పయాగంలో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించినట్లు తెలిపారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించినట్లు ఈవో వెల్లడించారు.
