
D Spiritual: Nov 17: మహబూబ్నగర్: పాలమూరు ప్రజల ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది.
ఈ సందర్భంగా దళిత పూజారులు ముత్యాల పల్లకీలో ఉద్దాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేలాది మంది భక్తులు ఉద్దాలను తాకి స్వామివారి ఆశీస్సులు పొందారు.
వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతో పాటు ఆలయ మైదానంలో ఎటుచూసినా భక్తుల సందడే కనిపించింది. స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు.
భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తిగిరులు మార్మోగాయి. ఉద్దాల ఉత్సవం భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ కన్నులపండువగా సాగింది.
