
ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఉద్యోగుల డేటా పరిశీలనలో ప్రభుత్వ జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తి రెండేసి జీతాలు పొందినట్లు గుర్తించారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల్లో 40 కేసులు వెలుగుచూశాయి. పోలీసు శాఖలోనే 17 కేసులు నమోదయ్యాయి. అక్రమంగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో రికవరీ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లోని ఉద్యోగుల డేటాను పరిశీలించగా పలు విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. ఒకే ఆధారిత ఐడెంటిటీ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉద్యోగం చేస్తున్నట్లుగా చూపించి రెండేసి వేతనాలు పొందినట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల పరిధిలో ప్రాథమికంగా 40 మంది అక్రమంగా రెండేసి జీతాలు పొందినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ఖజానా నుంచి ఒకే ఉద్యోగికి రెండు మార్గాల్లో వేతనాలు చెల్లింపైన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
అక్రమంగా ప్రభుత్వ జీతాలు పొందిన ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ అన్ని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమంగా పొందిన జీతం మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అక్రమ చెల్లింపులకు కారణమైన లేదా వాటికి సహకరించిన అధికారులపై కూడా బాధ్యతను నిర్ధారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరహా ఉల్లంఘనలను ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది
