
Google AI Policy: పాఠశాల విద్యార్థులు ఏఐ టూల్స్ వినియోగించే విషయంలో గూగుల్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై విద్యార్థులు గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, గూగుల్ సెర్చ్ వంటి సేవలను ఉపయోగించాలంటే పాఠశాల యాజమాన్యం అనుమతి తప్పనిసరి. పాఠశాలలు ఏఐ సేవలను నిలిపివేస్తే గూగుల్ సెర్చ్ కూడా పనిచేయదనే నిబంధన ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
టెక్ దిగ్గజం గూగుల్ విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారిత సేవలను వినియోగించడంపై ఇకపై మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా K-12 విద్యార్థుల ఖాతాల్లో గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, జెమిని ఇన్ క్లాస్‌రూమ్ వంటి సేవలను ఉపయోగించాలంటే పాఠశాల యాజమాన్యం అనుమతి ఉండాల్సిందే.
గూగుల్ తీసుకొస్తున్న కొత్త విధానం ప్రకారం.. విద్యార్థుల ఖాతాల్లో ఈ సేవలు ముందుగా డిఫాల్ట్‌గా నిలిపివేయబడతాయి. పాఠశాల యాజమాన్యం అనుమతించిన తర్వాతే వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల వయస్సు, విద్యా అవసరాలు, పాఠశాల నిబంధనలను బట్టి ఏఐ సేవలను అనుమతించాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా విద్యాసంస్థలకే అప్పగించింది.
ఈ మార్పులకు సంబంధించి రాబోయే నెలల్లో పాఠశాలలకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తామని గూగుల్ వెల్లడించింది. దీంతో పాఠశాలల్లో ఏఐ వినియోగంపై మరింత నియంత్రణ ఏర్పడనుంది.
గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి?
గూగుల్ విద్యా విభాగం వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ క్రిస్ ఫిలిప్స్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి అందిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తరగతి గదుల్లో సాంకేతికత, ఏఐ వినియోగంపై పాఠశాలలకు పూర్తి నియంత్రణ కల్పించడమే ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశమని గూగుల్ పేర్కొంది. విద్యార్థులు ఏ సేవలను ఉపయోగించాలి? ఎలాంటి ఏఐ సాధనాలను అనుమతించాలి? అనే విషయాలను నిర్ణయించే అధికారం పాఠశాలలకే ఉండనుంది.
AI సేవలు ఆపేస్తే గూగుల్ సెర్చ్ కూడా బంద్ అవుతుందా?
గూగుల్ కొత్త విధానంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఇదే. సాధారణంగా విద్యార్థులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొత్త విధానం ప్రకారం పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ఖాతాల్లో ఏఐ సేవలను పూర్తిగా నిలిపివేస్తే గూగుల్ సెర్చ్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని క్రిస్ ఫిలిప్స్ వెల్లడించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అలాంటి సమయంలో విద్యార్థులు గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే, పాఠశాల యాజమాన్యం ఈ సేవను అందుబాటులో ఉంచలేదని తెలిపే సందేశం స్క్రీన్‌పై కనిపించనుంది. అంటే ఏఐ సేవలను నియంత్రించే నిర్ణయం విద్యార్థుల సాధారణ సమాచార శోధనపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
విద్యార్థులపై AI ప్రభావంపై ఆందోళనలు
మరోవైపు చిన్న వయసులోనే విద్యార్థులు ఏఐ టూల్స్‌కు అలవాటు పడటంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న సందేహానికి ఏఐ చాట్‌బాట్‌లపై ఆధారపడటం వల్ల పిల్లల్లో సొంతంగా ఆలోచించే సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలపై ప్రభావం పడవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయం విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కొత్త చర్చకు తెరలేపింది. ఇకపై పాఠశాలలు ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
