
D News: Sept 15: ఏపీ ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీపీఎస్సీ (APPSC)తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ ఊరట లభించనుంది.
నాన్-యూనిఫాం (Non-Uniform) పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో వయోపరిమితి దాటిపోతుందేమోనని ఆందోళన చెందిన వేలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది.
యూనిఫాం పోస్టులకూ రెండేళ్ల సడలింపు
సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, జైళ్ల శాఖ వంటి యూనిఫాం (Uniform) పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా ప్రభుత్వం వయోపరిమితిలో సడలింపు కల్పించింది. ఈ కేటగిరీ పోస్టులకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్ల వయోసడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.
2027 సెప్టెంబర్ వరకు వర్తింపు
ప్రభుత్వం పెంచిన ఈ వయోపరిమితి నిబంధనలు 2027 సెప్టెంబర్ వరకు వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తించనున్నాయి. దీంతో రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీతో పాటు పోలీసు నియామకాల్లో వయోపరిమితి కారణంగా ఇంతకాలం అవకాశాలు కోల్పోయిన పలువురు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం లభించనుంది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా వయోపరిమితికి దగ్గరగా ఉన్న అభ్యర్థులు రాబోయే నియామకాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలు కలగనుంది.
