
D News: ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చడం ఒక ఎత్తయితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చూసి ప్రశంసించడం మరో ఎత్తు. తాజాగా హీరో సూరికి అలాంటి అరుదైన అభినందన దక్కింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజనీకాంత్.. స్వయంగా ఫోన్ చేసి సినిమా, తన నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని సూరి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
‘మండాడి’ని చూసి రజనీకాంత్ ఎంతో ఇష్టపడ్డారని, తనకు మనస్ఫూర్తిగా ఫోన్ చేసి అభినందించారని సూరి తెలిపారు. సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ తనకు, మొత్తం చిత్రబృందానికి ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ఫోన్ అవతలి వైపు నుంచి రజనీకాంత్ గొంతు వినడం తన జీవితంలోని విలువైన క్షణాల్లో ఒకటని, ఆయన చెప్పిన మాటలు తనకు లభించిన గొప్ప ఆశీర్వాదమని సూరి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మండాడి’కి ప్రస్తుతం మంచి స్పందన వస్తోంది. మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాడు తీర ప్రాంతాల్లో జరిగే సంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కింది. సముద్రంలో చిత్రీకరించిన యాక్షన్, బోట్ రేసింగ్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ షూటింగ్‌లో దాదాపు రెండు నెలల పాటు సముద్రంలోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్రబృందం తెలిపింది.
కామెడీ నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన సూరి.. ‘విడుదలై’తో హీరోగా కొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘గరుడన్’, ‘కొట్టుక్కాళి’, ‘మామన్’ వంటి సినిమాలతో తనలోని నటుడిని మరో కోణంలో చూపించారు. ఇప్పుడు ‘మండాడి’ కూడా ఆయన హీరోగా ఎదుగుతున్న ప్రయాణంలో మరో కీలక చిత్రంగా నిలుస్తోంది.
ఇక తన చిన్ననాటి నుంచి రజనీకాంత్‌పై సూరికి ఉన్న అభిమానం గురించి కూడా గతంలో ఆయన మాట్లాడారు. అలాంటి తన అభిమాన నటుడి నుంచి ‘మండాడి’కి నేరుగా ప్రశంసలు రావడంతో సూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతుండగా.. రజనీకాంత్ ప్రశంసలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
