
D Spiritual: Nov 9: 🕉️ నాగేశ్వర నాగనాథ ఆలయం – స్థల పురాణం
పరమేశ్వరుడు జ్యోతి రూపంలో భూమిపై వెలసిన పవిత్ర ప్రదేశాలను జ్యోతిర్లింగాలు అని అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదో క్షేత్రం అయిన నాగేశ్వరుని క్షేత్రం గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి ద్వారక, బైట్ ద్వారక ద్వీపాల మధ్య మార్గంలో ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్టించిన జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. రుద్ర సంహితంలోని ‘దారుకావనే నాగేశం’ అనే శ్లోకం ఈ క్షేత్ర విశిష్టతను తెలుపుతుంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ప్రకారం, పూర్వం దారుక అనే రాక్షసి పార్వతీదేవిని తపస్సు చేసి, తన భర్త దారుకుడికి ఎటువంటి ఆపద రాకుండా, తాను సుమంగళిగా ఉండే వరం పొందింది. ఈ వరాల బలంతో దారుక, దారుకుడు కలిసి మానవులను, మునులను, దేవతలను హింసించసాగారు.
రాక్షస దంపతుల ఆగడాలు భరించలేక దేవతలు భృగు మహర్షి కొడుకు అయిన ఔర్వ మహర్షిని ఆశ్రయించారు. ఔర్వుడు ఒక యజ్ఞం చేసి, దాని నుంచి వచ్చిన అమృతాన్ని దేవతలకు ఇవ్వగా, శక్తి పొందిన దేవతలు రాక్షస సైన్యాన్ని ఓడించారు. ఓడిపోయిన రాక్షసులు భూమండలం నుంచి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో జీవిస్తూ, సముద్రం వైపు ప్రయాణించేవారిని భక్షించసాగారు. ఆ సమయంలో సుప్రియుడు అనే శివ భక్తుడు వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఆ ద్వీపం వద్దకు చేరుకున్నాడు. దారుకుడి రాక్షస సైన్యం సుప్రియుని, అతని అనుచరులను బంధించి చెరసాలలో ఉంచి, రోజుకు కొంతమందిని భుజించసాగారు.
భయభ్రాంతులైన ప్రజలు కాపాడమని సుప్రియుడిని వేడుకోగా, సుప్రియుడు తాను బంధించబడిన ప్రాంతంలో తన భార్యతో కలిసి సైకత లింగాన్ని (పార్ధివలింగాన్ని) ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించాడు. సుప్రియుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించిన రాక్షస భటులు దారుక దంపతులకు ఈ విషయం చెప్పారు. దారుకుడు అక్కడికి చేరుకుని తన ఖడ్గంతో సుప్రియుడిని సంహరించబోయాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ పార్థివలింగంలో నుంచి కోటి సూర్యుల కాంతితో ఈశ్వరుడు ఆవిర్భవించి, దివ్య తేజంతో రాక్షస సైన్యాన్ని మొత్తం సంహరించాడు. దారుకుడిని సంహరించే సమయంలో, దారుకుని భార్య దారుక, తాను పొందిన వరాల కారణంగా పార్వతీదేవిని శరణు వేడుకుంది.
జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై, దారుక మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చిన కారణంగా దారుకుడిని సంహరించడం తగదు అని శివుడిని కోరింది. అప్పుడు శివుడు, దారుక దంపతుల వల్ల ప్రజలకు ఆపద రాకుండా చేయమని పార్వతితో పలికాడు. శివుని మాటలకు పార్వతీదేవి దారుక దంపతులను క్షమించి, ‘మీరు ఈరోజు నుంచి రాక్షస ప్రవృత్తిని విడిచి, ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి’ అని ఆదేశించింది. అనంతరం పార్వతి దేవి, శివుడిని నాగేశ్వరుడనే పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా దారుకావనంలో కొలువై భక్తులను అనుగ్రహించాలని కోరింది. ఆ విధంగా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.
ఈ నాగేశ్వర క్షేత్రంలో గర్భాలయంలో శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనం అని పిలుస్తారు. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాపారంలో నష్టపోయిన వారు తిరిగి నిలదొక్కుకుని, వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం. అలాగే, ఈ దర్శనం కలి దోషాన్ని తొలగిస్తుందని భక్తుల నమ్మకం. శివపురాణం ప్రకారం, ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుడిని అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారని సాక్షాత్తు ఆ పరమశివుడే వరం ఇచ్చాడని తెలుస్తోంది. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని దేవభూమి ద్వారకా క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కార్తిక మాసంలో నాగేశ్వరుని క్షేత్ర దర్శనం సకల పాపహరణం, ముక్తిదాయకం. ఓం నమః శివాయ!
