
D Educt: Oct 21: పేదరికం, వివక్ష ఉన్నత విద్యకు అడ్డుకాకూడదు: వీసీ ఘంటా చక్రపాణి
హైదరాబాద్: పేదరికం చదువుకు అడ్డుకాకూడదని, వివక్ష కారణంగా ఎవరూ ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోందని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ‘సమతా ఫ్రీషిప్’ పథకం ద్వారా ఉచితంగా డిగ్రీ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘సమతా ఫ్రీషిప్’తో ఉచిత డిగ్రీ విద్య
‘సమతా ఫ్రీషిప్’ పథకం కింద ఈ ఏడాది 516 మంది ఆదివాసీలు, 146 మంది దివ్యాంగులు, నలుగురు ట్రాన్స్జెండర్లు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందినట్లు వీసీ తెలిపారు. అర్హులైన వారికి ఉన్నత విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.500తోనే అడ్మిషన్
ఈ పథకం కింద కేవలం రూ.500తో అడ్మిషన్ కల్పించి, మిగిలిన ఫీజు మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ విధంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత డిగ్రీ విద్యను అందిస్తున్న డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
