D Spiritual: Nov 5: శబరిమల యాత్రకు TGSRTC ప్రత్యేక బస్సులు.. అయ్యప్ప భక్తులకు పలు రాయితీలు

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త అందించింది. మండల, మకర విలక్కు పూజా మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల యాత్రను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు భక్తులు, గురుస్వాములకు పలు రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది.

అయ్యప్ప స్వామి దర్శన సమయాలకు అనుగుణంగా TGSRTC ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను రెండు విడతలుగా నిర్వహించనుంది. మండల పూజల కోసం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, మకర విలక్కు పూజల కోసం డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకు ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

ఈ ప్రత్యేక బస్సులను బుక్ చేసే గురుస్వాములకు ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఒక బస్సును బుక్ చేసే గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఒకవేళ గురుస్వామి ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేస్తే, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మిగతా బస్సులకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్ చెల్లించనుంది.

అంతేకాకుండా, ప్రతి బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఇందులో ఇద్దరు వంట మనుషులు (కుక్స్), 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఇద్దరు చిన్న అయ్యప్పలు (మణికంఠలు), ఒక లగేజీ అటెండెంట్ ఉంటారు. వీరికి ఎలాంటి ప్రయాణ చార్జీలు వసూలు చేయరు.

ఈసారి TGSRTC కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ ప్రభుత్వం బోర్డర్ ట్యాక్స్ నుంచి పూర్తి మినహాయింపునిచ్చింది. దీంతో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులపై అదనపు ఆర్థిక భారం తగ్గనుంది. ఈ మినహాయింపు వల్ల ప్రయాణం మరింత చౌకగా మారడంతో పాటు భక్తులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

ప్రత్యేక బస్సుల బుకింగ్, ఇతర పూర్తి వివరాల కోసం భక్తులు TGSRTC అధికారులను సంప్రదించాలని సూచించారు. బస్సుల లభ్యత, బుకింగ్ విధానం, ఇతర సమాచారం కోసం ఆర్టీసీ హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *