
D Spiritual: Nov 10: వనభోజనాలు కార్తీక మాసంలోని అతి ముఖ్యమైన ఆచారం. ఈ రోజు భారతీయ ఆయుర్వేద వైద్యంలో మొక్కలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ప్రకృతి వరంగా భావించే ఉసిరి చెట్టు నీడలో విష్ణువును పూజించి భోజనం చేయడం జరుగుతుంది. కార్తీకపురాణం ప్రకారం ఉషోద వేళల్లో మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును ఆరాధిస్తే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. విష్ణుపురాణం కూడా ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ ధాత్రీ వృక్షం వద్దే కొలువై ఉంటారని చెబుతుంది. అందుకే ఈ వనభోజనాలను “ధాత్రి భోజనం” అని కూడా అంటారు.
ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అని పిలుస్తారు. పూర్వకాలం నుంచి దీనిని పవిత్రంగా భావించి పూజిస్తుంటారు. కార్తీక పురాణంలో సూత మహర్షి నైమిశారణ్యంలో మునులతో కలిసి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేశారని వర్ణించారు. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు, గోపబాలురతో కలిసి ఉసిరి నీడన భోజనం చేసిన సంఘటన భాగవతంలో ఉంది. ఈ రోజు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి చిత్రపటం ఉంచి పూజ చేసి, ఉసిరికాయల్లో దీపారాధన నిర్వహిస్తారు.
వనభోజనం చేసే ముందు ఉసిరి చెట్టుకు ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి. ఉసిరి పత్రితో విష్ణువుకు పూజ చేయాలని పెద్దలు చెబుతారు. ఈ చెట్టు నీడలో అరటి ఆకు లేదా పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ఠం. ఉసిరి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాగా, ఇక్కడ భోజనం చేస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. రకరకాల పండ్లు, పుష్పాలు, వృక్షాలు కలిగిన నదీతీరం లేదా సముద్రతీర ప్రాంతం ఉత్తమం. తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసి వంటి పవిత్ర మొక్కలు ఉంటే మరింత శ్రేయస్కరం. బయటి నుంచి తెచ్చిన ఆహారం కాకుండా అక్కడే వండుకోవడం ఆనవాయితీ. ఆదివారాలు, సెలవు రోజుల్లో సమీప ఉద్యానవనాలు, తోటలు, నదీతీరాల్లో పిల్లలు-పెద్దలు సంతోషంగా గడుపుతూ ఈ ఆచారాన్ని పాటిస్తారు.
ఉసిరి కాయలు కార్తీక మాసంలోనే బాగా వస్తాయి. ఆరోగ్యానికి సంజీవినిలాంటిది ఉసిరి. రోజూ ఏదో ఒక రూపంలో ఉసిరి తినాలని ఆయుర్వేదం సూచిస్తుంది. షడ్రుచుల్లో చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉసిరిలో ఉంటాయి. ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యం, ఆధ్యాత్మికత – మూడూ కలిసిన మన తెలుగు సంప్రదాయమే ఈ కార్తీక వనభోజనాలు!
