
DSports Dec18 2025: లక్నో: సాధారణంగా క్రికెట్ మ్యాచ్లు వర్షం వల్ల ఆగిపోవడం చూస్తుంటాం. కానీ, దట్టమైన పొగమంచు కారణంగా ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ పూర్తిగా రద్దు కావడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా బుధవారం జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్లో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాల్సి ఉంది. అయితే స్టేడియంను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో కనీసం ఎదురుగా ఉన్న ఆటగాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అంపైర్లు రాత్రి 6:50 నుంచి 9:30 వరకు దాదాపు ఆరు సార్లు మైదానాన్ని పరిశీలించారు. సమయం గడుస్తున్న కొద్దీ పొగమంచు మరింత పెరగడంతో, మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భావించి రాత్రి 9:30 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
