
D Spiritual: Nov 26: పూజల్లో పూలు ఉపయోగించడం హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన అంశం. కొంతమంది పూలు లేకుండా పూజ చేస్తారు కానీ పండితులు పూలు లేకుండా చేసే పూజ సంపూర్ణంగా ఉండదని చెబుతారు. ప్రతి దేవుడికి ప్రత్యేకంగా ఇష్టమైన పూలు ఉంటాయి. ఆ పూలతో పూజిస్తే దేవతలు సులభంగా ప్రసన్నమవుతారని నమ్మకం. ఇప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టం, ఆ పూలతో పూజిస్తే ఏమి ఫలితం దక్కుతుందో చూద్దాం.
పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వు (ధతుర పుష్పం) అత్యంత ప్రీతికరం. ఈ పువ్వుతో శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరడంతో పాటు శివకృప పూర్తి స్థాయిలో లభిస్తుంది. కాళికా మాతకు ఎర్రమందారం పువ్వు అత్యంత ఇష్టం. 108 మందార పూలతో మాతను పూజిస్తే ఏ కోరికైనా త్వరగా నెరవేరుతుందని పురాణాలు చెబుతాయి. విష్ణుమూర్తికి పారిజాత పువ్వులు ఎంతో ప్రీతిపాత్రం. ఈ పూలతో ఆయనను పూజిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయట.
లక్ష్మీదేవికి కమలపువ్వులు, తామర పువ్వులు ఎంతో ఇష్టం. ఈ పూలతో పూజిస్తే ఇంట్లో ధనం, ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. విఘ్నేశ్వరుడికి బంతిపువ్వులు (చండు పువ్వులు) ఎంతో ప్రీతికరం. ముఖ్యంగా ఆరెంజ్ రంగు బంతిపూల దండ వినాయకుడికి అత్యంత ఇష్టమైనదని భావిస్తారు.
చదువుల దేవత సరస్వతీదేవికి పలాస పువ్వులు ప్రత్యేకంగా ఇష్టం. పలాస పువ్వులతో పూజిస్తే విద్యలో విజయాలు సునాయాసంగా దక్కుతాయని చెబుతారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలంటే తులసీమాలను సమర్పించడం అత్యుత్తమం. తులసి స్వామివారికి అత్యంత పవిత్రమైనది. ఆంజనేయస్వామికి మల్లెపూలు అత్యంత ఇష్టం. మల్లెపూల దండలతో స్వామిని అలంకరిస్తే కోరికలు నెరవేరి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
