
DNews:13 Dec: మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వ మహిళా పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే, ఇదే మహిళా పొదుపు సంఘాల్లో ఇప్పుడు నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి.తాజాగా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ రూ.500 నోట్లు బయటపడటం సంచలనంగా మారింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఈఎంఐలను ప్రతినెల చెల్లించే క్రమంలో సంఘ సభ్యుల నుంచి వస్తున్న నగదులో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నాయని సమాచారం.
వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు తమ ఈఎంఐలకు సంబంధించిన నగదును టీమ్ లీడర్‌కు అప్పగించారు. ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఒక రూ.500 నోటు నకిలీదిగా గుర్తించడంతో బ్యాంకు అధికారులు ఆపేశారు. ఈ విషయం తెలిసిన గ్రూప్ సభ్యులు షాక్‌కు గురయ్యారు.ఇదే సంఘంలో గతంలో ఇప్పటికే రెండు సార్లు నకిలీ నోట్లు బయటపడ్డాయని, ఇది మూడోసారి కావడంతో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా పొదుపు సంఘాలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో, నకిలీ నోట్ల విషయంలో సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. నగదు స్వీకరించే సమయంలో నోట్లను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు, అనుమానం వచ్చిన నోట్లను వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
