
D Spiritual: Sept 8: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటపాటు ప్రత్యేక పూజా పర్వాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. అనంతరం ఆచార్యులు ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు సహస్రనామ పఠనంతో లక్షపుష్పార్చన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది.
ఈ విశేష పూజా కార్యక్రమాలను ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యుల బృందం నిర్వహించింది. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
