
D Educt: Sept 8: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో 37.91 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద మొత్తం 3.80 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, 1.57 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 1.49 లక్షల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1.44 లక్షల మందికి సీట్లు కేటాయించారు. ఈ వివరాలను ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ సి. కృష్ణ సెప్టెంబరు 7న వెల్లడించారు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలల్లో చేరాలని అధికారులు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 70,060 సీట్లు అందుబాటులో ఉండగా, 30,806 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే 43.97 శాతం సీట్లు నిండాయి.
ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో 26,468 సీట్లు అందుబాటులో ఉండగా, 8,316 సీట్లు కేటాయించారు. దీంతో ఈ విభాగంలో 31.41 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో 2,77,870 సీట్లు అందుబాటులో ఉండగా, 1,02,177 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ విభాగంలో 36.77 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇక విశ్వవిద్యాలయాల్లో మొత్తం 6,462 సీట్లు అందుబాటులో ఉండగా, 3,119 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో యూనివర్సిటీల్లో 48.26 శాతం సీట్లు నిండినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.
