DET:DEC 02:
ద్రౌపతి 2 వివాదం: చిన్మయి క్షమాపణ
దర్శకుడు మోహన్ జీ దర్శకత్వంలో వస్తున్న ద్రౌపతి 2 సినిమా మొదటి పాట ఎమ్‌కోనే విడుదల కాకముందే పెద్ద వివాదానికి కారణమైంది. ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడారు. అయితే పాట విడుదలవుతున్న సమయంలోనే చిన్మయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

చిన్మయి వివరణ: నా సిద్ధాంతాలకు విరుద్ధం:
ఎమ్‌కోనే పాట గురించి చిన్మయి తన మనసులోని మాటను ఇలా పంచుకున్నారు: ముందుగా, ఎమ్‌కోనే పాట గురించి నా హృదయపూర్వక క్షమాపణలు. సంగీత దర్శకుడు జిబ్రాన్ నాకు 18 ఏళ్లుగా తెలుసు. ఆయన ఆఫీస్ నుండి పిలవగానే, ఎప్పుడూ లాగే వెళ్లి పాట పాడి వచ్చేశాను. ఆ సమయంలో జిబ్రాన్ గారు కూడా అక్కడ లేరు. పాడాల్సిన విధానం గురించి నాకు చెప్పారు, నేను రికార్డింగ్ పూర్తి చేసి వెళ్లిపోయాను. ఈ సినిమా నేపథ్యం, దర్శకుడి సిద్ధాంతాల గురించి నాకు ఇప్పుడే తెలిసింది.తాను నమ్మే సిద్ధాంతాలకు, దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నందున, ముందుగా తెలిసి ఉంటే తాను ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొని ఉండేదాన్ని కాదని చిన్మయి స్పష్టం చేశారు.

దర్శకుడు మోహన్ జీ ప్రతిస్పందన: టెక్నీషియన్లను టార్గెట్ చేయొద్దు
చిన్మయి పోస్ట్ నెటిజన్ల విమర్శల నేపథ్యంలో దర్శకుడు మోహన్ జీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన నెటిజన్లను కోరారు. నా సినిమా ఏం చెప్పినా, అది నా సొంత సృష్టి, నా ఆలోచన. మీ టార్గెట్ నేనే. నాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేసిన వారిని టార్గెట్ చేయకండి. అది ఒక రకమైన పిరికిపంద చర్య అని మోహన్ జీ ఘాటుగా బదులిచ్చారు.

చర్చనీయాంశంగా మారిన సంఘటన:

ద్రౌపతి మొదటి భాగం నుంచే దర్శకుడు మోహన్ జీ కొన్ని వివాదాస్పద అంశాలతో సినిమాలు తీస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆ చిత్రానికి చిన్మయి లాంటి యాక్టివిస్ట్ గాయని పాట పాడటం చర్చనీయాంశమైంది. అయితే సినిమా ఇండస్ట్రీలో గాయనీగాయకులకు, ఇతర టెక్నీషియన్లకు ప్రాజెక్ట్ గురించి పూర్తిగా వివరాలు తెలియకపోవచ్చని కొందరు చిన్మయికి మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా, ఒక సినిమా పాట చుట్టూ ఇంత పెద్ద రచ్చ జరగడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.