DET:DEC 02:
కన్నడ నటి ఆషికా రంగనాథ్ బంధువు ఆత్మహత్య: అసలేం జరిగింది?
కన్నడ నటి ఆషికా రంగనాథ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె 22 ఏళ్ల బంధువు అయిన అచల హర్ష నవంబర్ 22న బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అచల హర్ష, ఈ ఘోర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆమె కుటుంబ సభ్యులు బయటపెట్టారు.

బాయ్‌ఫ్రెండ్ వేధింపులే కారణం: కుటుంబ సభ్యుల ఆరోపణ
అచల హర్ష ఆత్మహత్యకు ఆమె ప్రియుడు మయాంక్ గౌడ మరియు అతని తల్లి మయానా గౌడ వేధింపులే కారణమని అచల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మయాంక్ గౌడ మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అచల అతన్ని నిలదీయగా, మయాంక్ ఆమెను తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాటు,పోయి చనిపో అని అచలను అవమానించినట్లు కూడా తెలుస్తోంది.

లీకైన ఛాటింగ్ స్క్రీన్‌షాట్‌లు: మనసు విరిగిన మాటలు
సోషల్ మీడియాలో అచల, మయాంక్ గౌడ మధ్య జరిగిన ఛాటింగ్ స్క్రీన్‌షాట్‌లు బయటకు వచ్చాయి. అందులో అచల, మయాంక్‌తో నన్ను మోసం చేసినా, నువ్వు నన్ను వదిలేయాలనే ధైర్యం నీకు ఉంది. అది ఫర్వాలేదు. ఈ జన్మలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. నా మాటలు నీకు లెక్క కాకపోవచ్చు, కానీ నన్ను నువ్వు లక్ష ముక్కలుగా విరిచేశావు అని రాసినట్లు ఉంది. ఈ మాటలు ఆమె ఎంత బాధలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.

కేసు నమోదు, పోలీసుల దర్యాప్తు:
మయాంక్ గౌడ గతంలో కూడా అచలను శారీరకంగా హింసించాడని, ఇంట్లో గొడవలు సృష్టించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దికాలంగా వీళ్లిద్దరూ దూరపు బంధువులు అయినప్పటికీ, గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. మొదట్లో ఈ పెళ్లికి కుటుంబం ఒప్పుకోకపోయినా, మయాంక్ మారతాడని అచల నమ్మబలకడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే, మయాంక్ గౌడ, అతని తల్లి మయానా గౌడపై ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా కేసు నమోదైంది. ఈ కేసు మొదట హాసన్ సిటీ పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయింది, కానీ ప్రస్తుతం బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.