
D-news: దేశీయ విమానయాన సంస్థలకు మరోసారి ఇంధన భారం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరను లీటరుకు రూ.6.28 మేర పెంచుతూ, అంటే 5.46 శాతం పెంపు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశీయ విమానాలకు ATF ధర లీటరుకు రూ.115 నుంచి రూ.121.28కి చేరింది. వరుసగా రెండో నెలలోనూ ATF ధర పెరగడం గమనార్హం.
జూలైలో ATF ధరను లీటరుకు రూ.5 తగ్గించి రూ.110కి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆగస్టులో రూ.115కి పెంచగా, తాజా పెంపుతో జూలై ధరతో పోలిస్తే ఇప్పుడు రూ.11.28 అధికంగా ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ATF ధరల్లో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తుంది. ఆగస్టు 15న గత సవరణ జరిగింది.
విమానయాన సంస్థలపై ఖర్చుల భారం
విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ATF కీలక భాగం కావడంతో ధరల పెంపు నేరుగా వాటి ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలు మరింత పెరిగి, భవిష్యత్లో విమాన టికెట్ ధరలపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) నాన్-డొమెస్టిక్ సిలిండర్ ధరను కూడా రూ.2 పెంచారు. దీంతో సిలిండర్ ధర రూ.762 నుంచి రూ.764కు చేరింది.
జూలైలో వచ్చిన ధర తగ్గింపు తర్వాత వరుసగా రెండుసార్లు ATF ధర పెరగడం దేశీయ విమానయాన రంగానికి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది.
