
D Educt: Sept 1: అమెరికా, బ్రిటన్లకు చెందిన ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను అందజేసింది. నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం మరింత బలం చేకూర్చాయని అన్నారు.
తెలంగాణ విద్యార్థులు, యువతకు హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు తానే స్వయంగా నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు తెలంగాణలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుబాటులోకి తీసుకురానున్నాయని పేర్కొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గ్లోబల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటైతే మరిన్ని ప్రపంచస్థాయి మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెలంగాణకు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.
రాబోయే డిసెంబరు 7, 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’లో ప్రపంచ విద్యాసంస్థల భాగస్వామ్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. క్రీడారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అమెరికాలోని ప్రముఖ నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీతో పాటు.. బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన యూనివర్సిటీ ఆఫ్ లండన్.. భారత్‌లో తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్‌లో ప్రత్యేక విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. డా.ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు అంగీకరించింది. ఈ కోర్సులు నవంబరు నుంచే హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ ప్రతినిధి బృందం అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లండన్ బిజినెస్ స్కూల్, వర్జీనియా టెక్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సంస్థలకు చెందిన నిపుణుల బృందాలు త్వరలో హైదరాబాద్‌లో పర్యటించి.. నగరంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నాయి. అంతర్జాతీయ విద్యాసంస్థల రాకతో హైదరాబాద్ గ్లోబల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
