
D-News: నేపాల్‌లోని రసువా జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. స్యాబ్రుబేసి గ్రామ సమీపంలోని చిలిమే జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లోకి వరద నీరు ప్రవేశించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే టన్నెల్లో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు.
నేపాల్ పోలీస్ డీఐజీ డి. రెగ్మి ప్రకారం.. టన్నెల్లో పలు భవనాలు ఉండటంతో పాటు ప్రాజెక్ట్ కార్యకలాపాల సమయంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తుంటారు. వరదల కారణంగా టన్నెల్ దెబ్బతినడంతో నీరు లోపలికి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు.
హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రెస్క్యూ బృందాలు
మంగళవారం ఉదయం సుమారు 7 గంటల నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు టన్నెల్లోకి ప్రవేశించి లోపల చిక్కుకున్న వారి సంఖ్యను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా ప్రాంతానికి వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్లో సుమారు 25–30 మంది ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
బోటెకోషి నదికి వచ్చిన వరదల ప్రభావంతో రసువాతో పాటు నువాకోట్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. బోటెకోషి, త్రిశూలీ నదులు ఉప్పొంగడంతో త్రిశూలీ ప్రాంతంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. నువాకోట్‌లోని బిదూర్ ప్రాంతంలో సైన్యం సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (NDRRMA) ప్రకారం, 3,925 మంది గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 592 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు 11,379 మందిని రక్షించారు.
ఇదిలా ఉండగా, నేపాల్‌లో చిక్కుకున్న 158 మంది భారతీయులను సురక్షితంగా తరలించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుర్తుతెలియని మృతదేహాలను దేశవ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో భద్రపరిచి, వారి వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
