
D Spiritual: Dec 19: మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఇంట్లోను, దేవాలయాలలోను దేవుళ్లకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు తమ ఇష్టదైవంపై ఉన్న అపారమైన భక్తితో దేవుడి మాలలను ధరించి దీక్షలో ఉంటారు.
శివ మాల, అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల వంటి మాలలను భక్తులు తమ ఇష్టదైవానికి అనుగుణంగా ధరిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో అయ్యప్ప మాలలు ధరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సమానమని బోధించే అయ్యప్ప స్వామి, దీక్షలో ఉన్న భక్తుల హృదయాలలో కొలువై ఉంటాడని విశ్వాసం. ఈ దీక్ష కాలంలోనే కాకుండా ఆ సుగుణాలను జీవితాంతం పాటించాలని అయ్యప్ప దీక్ష బోధిస్తోంది.
అయ్యప్ప దీక్షలో ఉన్నవారు కొన్ని కఠినమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అయ్యప్ప స్వామిపై భక్తితో ఉదయం, సాయంత్రం చన్నీటితో స్నానం చేసి, కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ, కటిక నేలపై నిద్రిస్తూ స్వామిని స్మరిస్తూ ఉంటారు. ఈ విధంగా అయ్యప్ప దీక్షను ధరించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది.
దీక్ష కాలం పూర్తయిన తరువాత భక్తులు ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతారు. ఈ ఇరుముడికి కూడా ఎంతో విశిష్టత ఉంది. గురుస్వాముల చేత ఈ ఇరుముడిని కట్టించుకుంటారు. ఇందులో వివిధ రకాల పూజా సామాగ్రిని ఉంచడంతో పాటు, ఒక కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచుతారు.
ఈ కొబ్బరికాయను మన శరీరంగా, అందులో నింపే ఆవు నెయ్యిని మన ఆత్మగా భావించి శబరిమలలో అయ్యప్ప స్వామికి అర్పిస్తారు. దీని అర్థం మన దేహం, ఆత్మ అన్నీ స్వామికి సమర్పించినట్లేనని భక్తులు విశ్వసిస్తారు.
శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా క్యూ బుకింగ్ చేసుకొని, వారికి కేటాయించిన తేదీన క్యూ లైన్లలో నిలబడాలి. అయితే కొంతమంది అయ్యప్ప దీక్ష ధరించిన భక్తులు నేరుగా పంబాకు చేరుకొని, పంబా నదిలో స్నానం చేసి, అనంతరం చిన్న పాద మార్గం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఆ రోజుల్లో దర్శనాల సంఖ్యను మరింతగా పెంచుతూ ఏర్పాట్లు చేస్తున్నారు.
