
D Spiritual: Nov 8: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాలలో కార్తీకమాసం ఒకటి. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి, మాంసాహారం తీసుకోకుండా శివకేశవులను పెద్ద ఎత్తున ఆరాధిస్తారు. ఈ నెల మొత్తం ఉదయం, సాయంత్రం ఇంటి ఆవరణంలో దీపాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఇక కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున భక్తులు శివుడి ఆలయాలను సందర్శించి 365 వత్తులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా 365 వత్తులను వెలిగించడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే, సంవత్సరంలో ఉన్న 365 రోజులకు ప్రతీకగా దీనిని చేస్తారు. ఏడాది పొడవునా దీపారాధన చేయకపోయినా, కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించడం వల్ల సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను శివాలయాలలోనే వెలిగించాలనే నియమం ఏమీ లేదు. శివాలయాలు అందుబాటులో లేనివారు ఇంటి ఆవరణంలోని తులసి కోట ముందు వెలిగించినా లేదా ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఆలయాలలో వెలిగించినా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శివకేశవుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు చేసే దీపారాధన వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని చెబుతారు. అలాగే, ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయించడం లేదా ఆయన కథ వినడం కూడా ఎంతో శుభసూచికంగా భావిస్తారు.
