D Spiritual: Jan 29: సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. రాగి పాత్రలో శుద్ధ జలంతో పాటు ఎర్రచందనం, కుంకుమ, ఎర్ర పువ్వులు కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధానం ఆరోగ్యాన్ని ప్రసాదించి, పాపాలను హరిస్తుందని విశ్వాసం. నిత్యం లేదా ఆదివారాలు, సప్తమి వంటి ప్రత్యేక దినాలలో ఈ ఆచారాన్ని పాటించవచ్చు.

ప్రముఖ పండితులు సామవేదం షణ్ముఖ శర్మ తమ ప్రవచనాల్లో సూర్య అర్ఘ్య ప్రాధాన్యతను వివరించారు. అర్ఘ్యం అంటే పూజించుట అని, సూర్య నమస్కారం వలెనే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదని ఆయన తెలిపారు. ఇది సామాన్యులు కూడా సులభంగా ఆచరించదగిన సాధనగా పేర్కొన్నారు.

అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్ర అత్యుత్తమమని శణ్ముఖ శర్మ వివరించారు. ఆదిత్య పురాణంలో సూర్య భగవానుడు తామ్రమే తనకు అత్యంత ప్రీతికరమైన లోహమని చెప్పినట్లు ఉదాహరించారు. అందుకే రాగి పాత్రను శుభ్రంగా ఉంచి, అందులో పవిత్రమైన నీటిని తీసుకుని ఎర్రచందనం, కుంకుమ, ఎర్రని అక్షతలు, ఎర్ర పువ్వులు, దూర్వాంకురాలు కలపాలని సూచించారు. మోకాళ్లపై కూర్చుని సూర్యుడికి ఎదురుగా పళ్లెం పెట్టుకుని, ఆ పళ్లెంలోకి నీటిని వదులుతూ అర్ఘ్యం సమర్పించాలి.

సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆయన నామాలను జపించడం విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రధానంగా మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే 12 నామాలు ప్రసిద్ధి. కొన్ని గ్రంథాలలో, ముఖ్యంగా స్కాంద పురాణంలో 72 నామాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్ఘ్యం ఇవ్వవచ్చు లేదా “మిత్రరవిసూర్యభానుఖగపూషహిరణ్యగర్భమరీచ్యాదిత్యసవిత్రర్కభాస్కరేభ్యో నమః” అంటూ అన్ని నామాలను కలిపి ఒకే అర్ఘ్యం సమర్పించవచ్చు. ఇలా ఏడు మార్లు అర్ఘ్యం ఇవ్వడం కూడా శ్రేష్ఠమని పేర్కొన్నారు.

సూర్యనారాయణుడికి అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రారబ్ధ కర్మల వల్ల కలిగే రోగాలను తగ్గించే శక్తి సూర్యారాధనకు ఉందని శణ్ముఖ శర్మ తెలిపారు. పాపాలను పోగొట్టే సామర్థ్యం కూడా సూర్యుడికి ఉందని అన్నారు. దేవతలు శబ్దానికి ప్రీతిపాత్రులని, మంత్రాలు మరియు నామాలలోని శబ్ద ప్రకంపనలు అమోఘమైన శక్తిని కలిగి ఉంటాయని వివరించారు. ప్రతి నామం భగవంతుని శబ్దావతారమేనని చెబుతూ, సూర్య నామాలతో అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుందని స్పష్టం చేశారు.

అర్ఘ్యం సమర్పించేటప్పుడు “ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే” అనే మంత్రాన్ని పఠించాలని సూచించారు. ఈ మంత్రానికి “వేల కిరణాలు కలిగిన ఓ సూర్యా, తేజస్సు యొక్క రాశివి, జగత్తుకు పతివి, నా పట్ల దయ చూపి ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు, నీకు నమస్కారం” అనే అర్థం వస్తుంది. నిత్యం అర్ఘ్యం ఇవ్వడం కుదరని వారు కనీసం ఆదివారాల్లో ప్రత్యేకంగా సూర్యునికి నమస్కారం చేయాలని కూడా ఆయన సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana