
D Spiritual: Apr 22: హిందూ సంప్రదాయంలో దేవతా దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం ఒక పవిత్రమైన ఆచారం. తీర్థం అనేది సాధారణ నీరు కాదు; మంత్ర శక్తితో పవిత్రం చేయబడిన దైవిక జలం. భక్తితో స్వీకరించినప్పుడు ఇది ఆధ్యాత్మిక శాంతిని, శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వాసం ఉంది. అయితే తెలియక చాలా మంది తీర్థం తీసుకునే సమయంలో కొన్ని చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల తీర్థం ద్వారా లభించే పూర్తి ఫలితం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు.
తీర్థం అనే పదానికి “పవిత్రమైనది” అనే అర్థం ఉంది. దేవుడి పాదాలను అభిషేకించిన నీరు లేదా మంత్రాలతో పూజించిన కలశ జలాన్ని తీర్థంగా భావిస్తారు. ఇది మనసులోని మలినాలను తొలగించి శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుందని విశ్వాసం.
తీర్థం తీసుకున్న వెంటనే చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు తడి చేతులను తలపై తుడుచుకోవడం. శాస్త్రాల ప్రకారం ఇది చేయకూడని పని. తీర్థం దైవిక శక్తితో సమానం కాబట్టి దానిని సేవించిన తర్వాత తలకు తుడుచుకోవడం వల్ల ఆ పవిత్రత తగ్గిపోతుందని చెబుతారు.
అదివరకు, తీర్థం సేవించిన తర్వాత చేతిలో మిగిలిన తేమను కళ్లకు అద్దుకోవడం మంచిదని సంప్రదాయం. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా దైవ కాంతి లభిస్తుందని నమ్మకం ఉంది.
తీర్థం స్వీకరించే సమయంలో ఒక శ్లోకాన్ని స్మరించడం శ్రేయస్కరం — “అకాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం.. విష్ణు పాదోదకం పుణ్యం పునర్జన్మ న విద్యతే.” ఇంట్లో పూజ తర్వాత సాధారణంగా తీర్థాన్ని మూడు సార్లు స్వీకరించే ఆచారం ఉంది. ఆలయాల్లో మాత్రం పురోహితులు ఇచ్చే విధానాన్ని అనుసరించాలి.
తులసి ఆకులు కలిపిన తీర్థానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తులసి తీర్థం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలోని విషతుల్యాలు తొలగుతాయని విశ్వాసం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా శాంతిని అందిస్తుంది.
