
D Spiritual: Sept 21: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో జారీ చేసే సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని మరో నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తొలుత ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిలిపివేతను సెప్టెంబర్ 24వ తేదీ వరకు పొడిగించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 25 దర్శన టోకెన్లపై స్పష్టత
సెప్టెంబర్ 25వ తేదీ దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను ఒక రోజు ముందుగానే, అంటే సెప్టెంబర్ 24న జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
అయితే టోకెన్ల జారీ నిలిపివేతపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆదివారం (21న) టోకెన్ కేంద్రాలకు చేరుకున్న పలువురు భక్తులు నిరాశకు గురయ్యారు. భక్తులు ఈ మార్పును గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
