
D Spiritual: Aug 12: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతికూల వర్షాకాల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి 4,68,556 మంది భక్తులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
క్షేత్రాల వారీగా చూస్తే బద్రీనాథ్‌ను అత్యధికంగా 16,12,112 మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడ 3.5 లక్షల మందికి పైగా అదనంగా భక్తులు వచ్చారు. కేదార్‌నాథ్‌కు 14,50,116 మంది, గంగోత్రికి 7,37,629 మంది, యమునోత్రికి 6,62,347 మంది, హేమకుండ్ సాహిబ్‌కు 2,40,499 మంది భక్తులు వెళ్లారు.
భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. రాష్ట్ర విపత్తు నియంత్రణ గది నుంచి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో యాత్రికుల కదలికలను నియంత్రిస్తూ, అవసరమైతే యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సోమవారం ఒక్కరోజే 15,376 మంది భక్తులు చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.
