
D Educt: Aug 12: తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఆగస్టు నెలలో వరుస సెలవులు రానున్నాయి. పండగలు, ప్రత్యేక వేడుకలు, జాతీయ పర్వదినాల సందర్భంగా ప్రకటించిన సెలవులు వీకెండ్‌తో కలిసిరావడంతో వరుస సెలవులుగా మారుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు 8 రెండో శనివారం, 9 ఆదివారం సెలవులు కాగా, ఆగస్టు 10న బోనాల తర్వాతి రోజు సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా సెలవు ఇచ్చారు. దీంతో ఏపీలో రెండు రోజులు, తెలంగాణలో మూడు రోజుల పాటు వరుస సెలవులు వచ్చాయి.
పాఠశాలలకు వరుస సెలవులు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఈ నెలలో మరోసారి రెండు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.
ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అధికారిక సెలవు ఉంటుంది. పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణ తరగతులు నిర్వహించరు. ఆగస్టు 16 ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణలో విద్యార్థులకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.
ఈ వరుస సెలవులు విద్యార్థులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా కలిసిరానున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వారాంతాల్లో శని, ఆదివారాలు సాధారణంగా సెలవులు ఉంటాయి. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం, ఆదివారం కలిసిరావడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రెండు రోజుల విరామం లభించనుంది.
ఇదిలా ఉండగా, ఆగస్టు 13న మణిపూర్‌లో ప్రత్యేక సెలవు ఉండనుంది. ఆంగ్లో-మణిపురి యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళిగా ప్రతి ఏడాది పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 13 గురువారం మణిపూర్‌లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది.
దీంతో మణిపూర్‌లో విద్యార్థులు, ఉద్యోగులకు ఆగస్టు 13, 15, 16 తేదీల్లో సెలవులు రానున్నాయి. మధ్యలో ఆగస్టు 14న సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆగస్టు 15, 16 తేదీల్లో మాత్రమే సెలవులు ఉండనున్నాయి.
