హరిత భవనాలకు ఐజీబీసీ ధ్రువీకరణ.. పర్యావరణహిత నిర్మాణాలకు నాలుగు స్థాయిల్లో రేటింగ్స్‌

నీరు, విద్యుత్తు ఆదాతో పాటు ఆరోగ్యకరమైన జీవనం.. ప్లాటినమ్‌ అత్యున్నత హోదా

మార్కెట్లో వస్తువులు కొనేటప్పుడు వాటి నాణ్యతను తెలుసుకునేందుకు స్టార్‌ రేటింగ్స్‌, కస్టమర్ల రివ్యూలు చూస్తాం. హోటల్‌లో బస చేయాలన్నా, సినిమా చూడాలన్నా ఆన్‌లైన్‌ రేటింగ్స్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. మరి జీవితకాల పెట్టుబడిగా భావించే ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను ఎలా అంచనా వేయాలి? నిర్మాణ ప్రమాణాలు, పర్యావరణహిత సదుపాయాలు, నీరు, విద్యుత్తు పొదుపు వంటి అంశాలపై భవనానికి లభించిన గ్రీన్‌ రేటింగ్‌ ఉపయోగపడుతుంది. ఈ విషయంలో సీఐఐ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ధ్రువీకరణ కీలకంగా నిలుస్తోంది.

హరిత భవనాలకు నాలుగు రకాల రేటింగ్స్‌

దేశంలో పర్యావరణహిత భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు 2001లో హైదరాబాద్‌ కేంద్రంగా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఐజీబీసీని ఏర్పాటు చేసింది. వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ భవనాల రకాలు, వినియోగాన్ని బట్టి 34 రకాల రేటింగ్‌ విధానాలను అమలు చేస్తోంది. ఇందులో నివాస భవనాలకు ప్రత్యేకంగా నాలుగు స్థాయిల్లో ధ్రువీకరణ ఇస్తోంది.

భవనం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో పాటించే పర్యావరణ ప్రమాణాల ఆధారంగా ఈ రేటింగ్‌ నిర్ణయిస్తారు. నీటి, విద్యుత్తు పొదుపు, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆయా ప్రమాణాలకు అనుగుణంగా సాధించిన పాయింట్లను బట్టి సర్టిఫైడ్‌, సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినమ్‌ రేటింగ్స్‌ కేటాయిస్తారు.

వ్యక్తిగత ఇళ్లకు కూడా ఐజీబీసీ గ్రీన్‌ హోమ్స్‌ విభాగంలో ధ్రువీకరణ పొందవచ్చు. వాననీటి సంరక్షణ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, సౌర విద్యుత్తు వినియోగం, నిర్మాణ సామగ్రి నాణ్యత, పచ్చదనం వంటి అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.

సర్టిఫైడ్‌.. ప్రారంభ స్థాయి రేటింగ్‌

ఇది ప్రాథమిక స్థాయి గ్రీన్‌ రేటింగ్‌. కనీస పర్యావరణ ప్రమాణాలు, మంచి నిర్మాణ పద్ధతులను పాటించే భవనాలకు ఈ హోదా లభిస్తుంది.

  • సంప్రదాయ నిర్మాణాలతో పోలిస్తే ప్రణాళిక, రూపకల్పన దశ నుంచే పర్యావరణహిత చర్యలు చేపట్టాలి.
  • నిర్మాణం పూర్తయ్యాక నిర్దేశిత ప్రమాణాలు పాటించారా? లేదా? అని పరిశీలించి సర్టిఫైడ్‌ హోదా ఇస్తారు.
  • నిర్మాణం పూర్తికాకముందు కేవలం డిజైన్‌ ఆధారంగా ఇచ్చే ధ్రువీకరణను ప్రీ-సర్టిఫైడ్‌గా పిలుస్తారు.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20,458 ప్రాజెక్టులు ఐజీబీసీలో రిజిస్టర్‌ కాగా, వాటిలో 8,613 ప్రాజెక్టులకు సర్టిఫికేషన్‌ లభించింది.

సిల్వర్‌.. అదనపు పర్యావరణ ప్రమాణాలు

ప్రాథమిక ప్రమాణాలతో పాటు మరిన్ని పర్యావరణహిత చర్యలు, ఇంధన పొదుపు, వనరుల సమర్థ వినియోగం ఉన్న భవనాలకు సిల్వర్‌ రేటింగ్‌ లభిస్తుంది.

  • నిర్మాణ సమయంలో మట్టి కోతకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
  • స్థానిక భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా డిజైన్‌ రూపొందించాలి.
  • సహజసిద్ధమైన ల్యాండ్‌స్కేప్‌, స్థానిక చెట్లు, పచ్చదనాన్ని సంరక్షించాలి.
  • వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. నీటి వినియోగాన్ని తగ్గించే ప్లంబింగ్‌ పరికరాలు అమర్చాలి.
  • నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి. రీసైకిల్‌ చేసిన, స్థానికంగా తయారైన నిర్మాణ సామగ్రిని వినియోగించాలి.
  • ఇంట్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా పైకప్పుపై ప్రత్యేక పెయింట్‌, టైల్స్‌ వేయాలి. నీడనిచ్చే చెట్లను పెంచాలి.
  • నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికులకు ప్రాంగణంలోనే కనీస సదుపాయాలు కల్పించాలి.

గోల్డ్‌.. విద్యుత్తు, నీటి పొదుపునకు ప్రాధాన్యం

సిల్వర్‌ రేటింగ్‌కు సంబంధించిన ప్రమాణాలతో పాటు విద్యుత్తు ఆదా, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఇంటి లోపలి గాలి నాణ్యత వంటి అంశాల్లో మెరుగైన ప్రమాణాలు పాటించే భవనాలకు గోల్డ్‌ రేటింగ్‌ ఇస్తారు.

  • నివాస ప్రాంగణంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలి. ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌, వర్మీ కంపోస్టింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
  • మొత్తం ఇంధన అవసరాల్లో 15 శాతం తీర్చేలా హైబ్రిడ్‌ జనరేటర్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
  • ఇళ్లలోకి సహజ గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్‌ వెంటిలేషన్‌ ఉండేలా డిజైన్‌ రూపొందించాలి.
  • ఇంటి లోపల రసాయన కాలుష్యం తగ్గించేందుకు తక్కువ వీవోసీ (VOC) కలిగిన పెయింట్లు, గ్లూలను ఉపయోగించాలి.
  • అద్దాల ద్వారా వేడి ఎక్కువగా లోపలికి రాకుండా తక్కువ ‘యు’ విలువ కలిగిన గ్లాస్‌లను వినియోగించాలి.

ప్లాటినమ్‌.. అత్యున్నత గ్రీన్‌ హోదా

Buying a Home? Don't Check Just the Price – Know Its Green Building Rating Too!

ఐజీబీసీ ఇచ్చే రేటింగ్స్‌లో ప్లాటినమ్‌ అత్యున్నత స్థాయి. ఆధునిక సాంకేతికతతో పాటు విస్తృతమైన పర్యావరణహిత చర్యలు అమలు చేసే భవనాలకు ఈ గుర్తింపు లభిస్తుంది.

  • నివాస ప్రాజెక్టు ప్రాంగణంలోనే సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
  • మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ (ఎస్‌టీపీ) తప్పనిసరిగా ఉండాలి. శుద్ధి చేసిన నీటిని మొక్కలకు, ఫ్లషింగ్‌ అవసరాలకు వినియోగించాలి.
  • సౌర విద్యుత్తు ఆధారంగా వేడి నీటిని అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
  • త్వరగా పునరుత్పత్తి అయ్యే కలప వంటి పర్యావరణహిత నిర్మాణ సామగ్రిని ఉపయోగించాలి. పదేళ్లలోపు పెరిగే వెదురును ఫ్లోరింగ్‌ వంటి అవసరాలకు వినియోగించడం కూడా ఇందులో భాగమే.

హరిత భవనాలతో ఎన్నో ప్రయోజనాలు

హరిత భవనాల వల్ల నీటిని 30 శాతం వరకు, విద్యుత్తును 40 శాతం వరకు ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో గాలి నాణ్యత మెరుగుపడటంతో నివాసితుల ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్‌ సర్టిఫికేషన్‌ పొందిన ఇళ్లకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని, అద్దెలు కూడా అధికంగా లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల ఇల్లు కొనుగోలు చేసే సమయంలో ధర, విస్తీర్ణం, ప్రాంతంతో పాటు భవనానికి ఉన్న గ్రీన్‌ రేటింగ్‌, అందులోని పర్యావరణహిత సదుపాయాలను కూడా పరిశీలించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *