D news:nov:15ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచవరం మండల పరిధిలో, మోర్జంపాడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో, ఎత్తైన రాతి గుట్టల నడుమ ఈ పురాతన క్షేత్రం ప్రకృతి ఒడిలో కొలువై ఉంది.

ఈ ఆలయానికి బుగ్గ మల్లేశ్వరుడు అనే పేరు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. సాధారణంగా శివాలయాల్లో స్వామివారి అభిషేకానికి అవసరమైన నీటిని బయట నుంచి తీసుకువస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం గర్భాలయంలోని శివలింగం పక్కనే సహజసిద్ధమైన నీటి బుగ్గ ఉంది. చుట్టుపక్కల పెద్దగా నీటి వనరులు కనిపించకపోయినా, ఈ బుగ్గలో నీరు నిరంతరం ఊరుతుండటం విశేషం. ఈ పవిత్ర జలంతోనే స్వామివారికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకతే ఆలయానికి బుగ్గ మల్లేశ్వర స్వామి అనే పేరును తీసుకొచ్చింది.

శివుడితో పాటు భ్రమరాంబ, సీతారాముల దర్శనం

ఈ క్షేత్రంలో బుగ్గ మల్లేశ్వర స్వామి భ్రమరాంబ అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామివారి సమీపంలో భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు. దీంతో ఈ ఆలయం శైవ సంప్రదాయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆలయానికి ఎదురుగా వృద్ధ లింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం కంటే ముందుగానే ఈ శివలింగం ప్రతిష్ఠితమైందని స్థానికులు చెబుతారు.

ఇక ఆలయానికి దక్షిణ దిశలో సీతారాముల ఆలయం ఉంది. అక్కడికి ఎదురుగా ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్నారు. ఆగ్నేయ దిశలో నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. ఇక్కడ నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఇలా ఒకే ఆలయ ప్రాంగణంలో శివుడు, భ్రమరాంబ అమ్మవారు, సీతారాములు, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి కొలువై ఉండటం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో రెండు పవిత్ర కోనేరులు కూడా ఉన్నాయి.

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు సేవలు

చారిత్రక ఆధారాల ప్రకారం, బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉండవచ్చని తెలుస్తోంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ఆలయాన్ని, అక్కడి సహజ నీటి బుగ్గను చూసి ఆశ్చర్యానికి గురయ్యారని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి పట్ల భక్తిశ్రద్ధలతో ఆయన నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు స్థానిక కథనాల ద్వారా తెలుస్తోంది.

ప్రత్యేక పూజలు ఎప్పుడు?

ఈ ఆలయంలో అనాదిగా ప్రతి సోమవారం మాత్రమే పూజలు నిర్వహించడం విశేషం. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతం తపస్సు ఆచరించడానికి ఎంతో అనువైన పవిత్ర భూమి అని రామానంద సరస్వతి స్వామివారు పేర్కొన్నట్లు ప్రతీతి.

ఎలా చేరుకోవాలి?

బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి మోర్జంపాడు మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ప్రకృతి రమణీయత నడుమ, ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్న ఈ అరుదైన హరిహర క్షేత్రం శివభక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే భక్తులకు ఈ ఆలయ సందర్శన ఓ ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *