
D NEWS: తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా, థర్మల్ ప్లాంట్ల పనితీరుపై పరిశీలనకు బీఆర్‌ఎస్ ఆరు ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి, కాకతీయ, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లతో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఈ బృందాలు పరిశీలించనున్నాయి.
యూనిట్లు ఎందుకు నిలిచిపోయాయి, విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది, బొగ్గు సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలను బృందాలు పరిశీలిస్తాయని కేటీఆర్ తెలిపారు. ప్రజా ఆస్తులైన విద్యుత్ ప్లాంట్లను ప్రజాప్రతినిధులు పరిశీలించకుండా ప్రభుత్వం అడ్డుకోవద్దని కోరారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించనుంది. కొత్తగూడెం ప్లాంట్‌కు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం, భద్రాద్రి ప్లాంట్‌కు పువ్వాడ అజయ్‌కుమార్, రేగా కాంతారావు నేతృత్వంలోని బృందాలు వెళ్లనున్నాయి.
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టును పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గండ్ర రమణారెడ్డి తదితరులతో కూడిన బృందం పరిశీలించనుంది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మరో బృందం సందర్శించనుండగా, హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రత్యేక బృందం పరిశీలించనుంది.
రాష్ట్రంలో విద్యుత్ కొరతకు బొగ్గు సరఫరా, ప్లాంట్ల నిర్వహణలో సమస్యలే కారణమని కేటీఆర్ ఆరోపించారు. యాదాద్రి ప్లాంట్ 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం సుమారు 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, పలు అంశాలపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్‌నినో కారణంగా విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయన్న ప్రభుత్వ వాదనను ఆయన వ్యతిరేకించారు. ఆరు బృందాలు సేకరించే వివరాలను ప్రజల ముందుంచిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
