
D News: Aug 1: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సందర్శించే వారికి జూ యాజమాన్యం కొత్త చార్జీలను ప్రకటించింది. సాధారణ ప్రవేశ రుసుములతో పాటు సఫారి రైడ్లు, బ్యాటరీ వాహనాలు, టాయ్ ట్రైన్ వంటి సేవల ధరలను పెంచింది. ఈ కొత్త రుసుములు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు జూ క్యురేటర్ జె. వసంత తెలిపారు. జూ నిర్వహణ వ్యయాలు పెరగడం, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త ధరల ప్రకారం సాధారణ పెద్దల ప్రవేశ రుసుము రూ.100 నుంచి రూ.120కు పెరిగింది. చిన్నారుల టికెట్ ధర రూ.50 నుంచి రూ.60కు చేరింది. విదేశీ పర్యాటకుల కోసం పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.500గా ప్రవేశ రుసుమును నిర్ణయించారు. దీంతో సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జూ పార్క్‌ను సందర్శించే వారికి అదనపు భారం పడే అవకాశం ఉంది.
జూ పార్క్‌లోని సఫారి సేవల చార్జీల్లో కూడా పెంపు జరిగింది. ఏసీ సఫారి బస్సు ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రూ.165, సాధారణ సఫారి బస్సుకు రూ.110 వసూలు చేస్తున్నారు. అలాగే బ్యాటరీ వాహనాల్లో ప్రయాణించేందుకు పెద్దలకు రూ.135, చిన్నారులకు రూ.65గా రుసుము నిర్ణయించారు. చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండే టాయ్ ట్రైన్లో ప్రయాణించేందుకు పెద్దలు రూ.90, పిల్లలు రూ.45 చెల్లించాల్సి ఉంటుంది.
జూ పార్క్‌లోని ప్రత్యేక ఆకర్షణలను సందర్శించేందుకు కూడా వేర్వేరు రుసుములు అమల్లో ఉన్నాయి. చేపల అక్వేరియం సందర్శించేందుకు ఒక్కో వ్యక్తికి రూ.25 చెల్లించాలి. నిశాచర జంతుశాలను వీక్షించేందుకు పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.15గా టికెట్ ధర నిర్ణయించారు. అలాగే సరీసృపాల విభాగాన్ని సందర్శించేందుకు పెద్దలకు రూ.35, పిల్లలకు రూ.15 వసూలు చేస్తున్నారు.
ఫోటోగ్రఫీ చేయాలనుకునే సందర్శకుల కోసం కూడా ప్రత్యేక అనుమతి రుసుములు అమల్లో ఉన్నాయి. సాధారణ కెమెరా వినియోగానికి రూ.500, ప్రొఫెషనల్ కెమెరా, లెన్స్ సెటప్‌కు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త చార్జీల వివరాలను ముందుగానే తెలుసుకుని, అందుకు అనుగుణంగా తమ సందర్శనను ప్లాన్ చేసుకోవాలని జూ యాజమాన్యం సూచించింది.
