
D News: Jul 30: ఆగస్టు నెల బ్యాంక్ సెలవులు.. ముందుగానే తెలుసుకోండి: బ్యాంక్ సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. రోజువారీ డిజిటల్ లావాదేవీలపై పెద్దగా ప్రభావం లేకపోయినా, చెక్కుల క్లియరెన్స్, బ్యాంక్ బ్రాంచ్‌లలో జరిగే సేవలు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు. అందువల్ల బ్యాంకుతో సంబంధం ఉన్న పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
మరో రెండు రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుండటంతో బ్యాంక్ సెలవులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రతి నెల మాదిరిగానే ఆగస్టులో కూడా పలు పండుగలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది.
ఆగస్టు 4న త్రిపురలో కేర్ పూజ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 8న టెండోంగ్ లో రమ్ ఫాట్ పండుగ కారణంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు 13న దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు మూసివేస్తారు. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 19న మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం, మిలాద్-ఎ-షరీఫ్ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ సహా సంబంధిత రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. దీంతో ఏపీ ప్రజలు తమ బ్యాంక్ బ్రాంచ్‌లలో చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
ఆగస్టు 28న రక్షా బంధన్, పాంగ్-లబ్సోల్, ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ, శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఇవి కాకుండా సాధారణ వారాంతపు సెలవులు కూడా ఉంటాయి. ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాల కారణంగా, అలాగే ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 22న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. బ్యాంక్ బ్రాంచ్ సేవలు అవసరమైన వారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం ఉత్తమం.
